జార్ఖండ్ సీఎం సోరెన్ మిస్సింగ్.. కనిపెట్టాలంటూ బీజేపీ నేత రివార్డు
జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎపిసోడ్ సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 9:00 AM GMTజార్ఖండ్ సీఎం సోరెన్ మిస్సింగ్.. కనిపెట్టాలంటూ బీజేపీ నేత రివార్డు
జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎపిసోడ్ సంచలనంగా మారింది. ఆయన మూడ్రోజులుగా అందుబాటులో లేరనీ.. త్వరలోనే నాయకత్వంలో కూడా మార్పు ఉంటుందనే ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. దాంతో.. జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. హేమంత్ సోరెన్ నివాసంతో పాటు రాజ్‌భన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే భూకుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ హేమంత్ సోరెన్‌ను కలిసేందుకు 13 గంటల పాటు ఎదురుచూశారు. కానీ.. ఈడీ అధికారుల విచారణ కోసం హేమంత్ సోరెన్ అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత ఈడీ అధికారులు సోదాలు చేశారు. రెండు బీఎండబ్ల్యూ కార్లు, పలు దస్త్రాలు, రూ.36లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు.
ఇక జనవరి 31 రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకు సందేశాన్ని పంపారట. బుధవారం మధ్యాహ్నం సోరెన్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈడీ అధికారులకు సీఎం సోరెన్ అందుబాటులోకి రాకపోవడంతో బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం అదృశ్యమయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ కీలక ప్రకటన చేశారు. సోరెన్ చిత్రంతో ఉన్న పోస్టర్‌ను ఎక్స్‌లో పోస్టు చేసి, ఆయన గురించి సమచారం ఇచ్చిన వారికి రూ.11 వేల రివార్డు ప్రకటించారు. ప్రస్తుతం బాబూలాల్ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది
तलाश है झारखंड के गुमशुदा मुख्यमंत्री की...
— Babulal Marandi (@yourBabulal) January 30, 2024
जिन किसी भी सज्जन को यह व्यक्ति दिखें तो, दिए गए पते पर तुरंत सूचित करें।
सही जनकारी देने वाले को 11 हजार रुपये नगद राशि दी जाएगी। pic.twitter.com/9nvFhVQlnl
ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విషయంపై రాష్ట్ర గవర్న్ సీపీ రాధాకృష్ణన్ కూడా స్పందించారు. సీఎం సోరెన్ స్పందన గురించి అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. రాజ్యాంగ పరిధిలోనే అందరూ పనిచేయాలని అన్నారు. అయితే.. రాజకీయంగా ఉన్న విబేధాలతో తనకు సంబంధంలేదన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకూడదని ఈ సందర్భంగా చెప్పారు జార్ఖంగ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.