తొమ్మిదోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం, మంత్రులు వీరే..
బీహార్‌లో కొద్దిరోజులుగా నడుస్తోన్న పొలిటికల్ హైడ్రామాకు తెరపడింది.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 7:00 PM ISTతొమ్మిదోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం, మంత్రులు వీరే..
బీహార్‌లో కొద్దిరోజులుగా నడుస్తోన్న పొలిటికల్ హైడ్రామాకు తెరపడింది. ఆదివారం ఉదయం బీహార్ గవర్నర్‌ను కలిసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని కూడా అందించారు. దాంతో.. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మహాఘట్ బంధన్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత సాయంత్రమే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఉత్కంఠల మధ్య జేడీయూ అధినేత నితీష్ కుమార్ తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. నితీష్‌తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త అలెయిన్స్‌లో బాగంగా.. జేడీయూ నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తే.. బీజేపీ నుంచి ఇద్దరు, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, మరొక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి సంతోష్ కుమార్, సుమన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే డాక్టర్ ప్రేమ్‌కుమార్ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు అయ్యారు.
బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు ఉండాలి. అయితే.. ఆర్జేడీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు మాత్రం 45 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా జేడీయూకి మద్దతు తెలపడంతో జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఏర్పడింది. ఈ నేపథ్యలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం నితీష్ కుమార్.