జమ్ములో ఉగ్రదాడి, అమరులైన ఐదుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కతువా జిల్లాలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 9 July 2024 7:30 AM ISTజమ్ములో ఉగ్రదాడి, అమరులైన ఐదుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కతువా జిల్లాలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. కాగా.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల్లో భద్రతాలబలగాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. దాంతో.. ఆర్మీ కాన్వాయ్‌ను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఇదే ఘటనలో మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి సమయంలో మాచెడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై సైనికులు పెట్రోలింగ్ చేస్తున్నారు.
కథువా జిల్లాలోని మాచేడి-కిండ్లీ- మల్హర్ రోడ్డు మార్గంలో కాపుకాసిన ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి తెగబడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ కాన్వాయ్‌పైకి తొలుత గ్రనేడ్ విసిరారు. దీంతో వాహనం ఆగడంతో కాల్పులు ప్రారంభించారు. కాల్పులతో అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు పరారయ్యారు. సమాచారం అందుకున్న అదనపు బలగాలు అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం కూంబింగ్ జరుపుతున్నాయి.
జమ్ములో ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గత 48 గంటల్లో సైన్యంపై దాడి జరగడం ఇదిరెండోసారి. ఆదివారం రాజౌరి జిల్లా ఆర్మీ క్యాంపుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.