జమ్ముకశ్మీర్‌లో బస్సుపై దాడి చేసింది మేమే : TRF ప్రకటన
జమ్ముకశ్మీర్‌లో బస్సుపై దాడిపై తాజాగా లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంచలన ప్రకటన చేసింది.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 9:11 AM GMTజమ్ముకశ్మీర్‌లో బస్సుపై దాడి చేసింది మేమే : TRF ప్రకటన
జమ్ముకశ్మీర్‌లో బస్సుపై దాడికి పాల్పడ్డారు. దీనిపై తాజాగా లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంచలన ప్రకటన చేసింది. రియాస్ వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామే అని వెల్లడించింది. రియాస్‌లోని శివ్‌ఖోరి పుణ్యక్షేత్రం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో.. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో పది మంది భక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. కాల్పులు తర్వాత బస్సు లోయలో పడిపోవడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు.
ఇక బస్సుపై కాల్పుల సంఘటన తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యి.. చుట్టుపక్కల ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఒక వైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే టీఆర్ఎఫ్ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఇక గతంలో కూడా ఈ తరహా ఉగ్రదాడులు జరిగాయి. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఉండి కాల్పులకు తెగబడ్డారు. బస్సుపై ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బస్సుపై దాడి ఘటనలో బాధితులంతా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. మృతుల వివారాలను తెలియాల్సి ఉంది.
ద రిసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనీ.. గతేడాది జనవరిలో ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. కాగా.. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్‌ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది.