ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం: భారత సైన్యం
ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం తెలిపింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 July 2024 2:00 PM ISTప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం: భారత సైన్యం
జమ్మూకశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం తెలిపింది. రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనే అమరులైన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. “కతువాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు ధైర్యవంతులను కోల్పోయినందుకు నేను ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. ఈ దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారతదేశం ఓడించి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటుంది." అని గిరిధర్ అరమనే చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ దాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత కశ్మీర్ టైగర్స్ అనే మిలిటెంట్ గ్రూప్ ప్రకటించుకుంది.
సోమవారం నాడు కతువా జిల్లాలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఆర్మీ కాన్వాయ్‌ను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఇదే ఘటనలో మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి సమయంలో మాచెడి-కిండ్లీ-మల్హర్ రహదారిపై సైనికులు పెట్రోలింగ్ చేస్తున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ కాన్వాయ్‌పైకి తొలుత గ్రనేడ్ విసిరారు. దీంతో వాహనం ఆగడంతో కాల్పులు ప్రారంభించారు. కాల్పులతో అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు పరారయ్యారు.