హత్య కేసులో మాజీ సీఎం కుమారుడికి జీవిత ఖైదు

ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత వివాదాస్పదమైన రామావతార్ జగ్గీ హత్య కేసులో న్యాయవ్యవస్థ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

By -  Medi Samrat
Published on : 6 April 2026 4:36 PM IST

హత్య కేసులో మాజీ సీఎం కుమారుడికి జీవిత ఖైదు

ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత వివాదాస్పదమైన రామావతార్ జగ్గీ హత్య కేసులో న్యాయవ్యవస్థ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన దివంగత అజిత్ జోగీ కుమారుడు అమిత్ జోగీని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు దోషిగా నిర్ధారించి, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ప్రధాన న్యాయమూర్తి రమేష్ సిన్హా, జస్టిస్ అరవింద్ కుమార్ వర్మలతో కూడిన ధర్మాసనం.. సాక్ష్యాధారాలు లేవనే కారణంతో అమిత్ జోగిని నిర్దోషిగా విడుదల చేసిన దిగువ కోర్టు తీర్పును రద్దు చేసింది. మూడు వారాల్లోగా అతను లొంగిపోవాలని కోర్టు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

2003 జూన్ 4న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు రామావతార్ జగ్గీ హత్య రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని కుదిపేసింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం వెలువడిన ఈ తీర్పును, జగ్గీ కుటుంబానికి 'న్యాయ విజయం'గాను, అమిత్ జోగీ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద దెబ్బగాను పరిగణిస్తున్నారు.

అమిత్ జోగి ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో ఒక ప్రభావవంతమైన, వివాదాస్పద వ్యక్తిగా ఉన్నారు. ఆయన ప్రధానంగా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడిగా ప్రసిద్ధి చెందారు. జోగి స్వయంగా మర్వాహి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం తన పార్టీ అయిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జె) ద్వారా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. అయితే ఆయ‌న వివాదాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్నారు. అది అంత్‌గఢ్ టేప్ కుంభకోణం అయినా, పౌరసత్వం, కులానికి సంబంధించిన వివాదాలైనా, అమిత్ జోగి ఎప్పుడూ వార్తల్లోనే ఉన్నారు. అతని జీవితంలోనే అత్యంత తీవ్రమైన న్యాయపరమైన కేసు రామావతార్ జగ్గీ హత్య కేసు, ఇందులో ఆయ‌న‌ ఇప్పుడు దోషిగా తేలాడు.

Next Story