మీరు రైతు కొడుకు అయితే.. నేను కూలీ కొడుకును.. : ధన్‌ఖర్‌కు ఖర్గే కౌంటర్..!
ఈరోజు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ఉధృతంగా సాగింది. తనపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన విపక్షాలపై రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్‌ఖర్ మండిపడ్డారు.
By Medi Samrat Published on 13 Dec 2024 8:49 AM GMTఈరోజు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ఉధృతంగా సాగింది. తనపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన విపక్షాలపై రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్‌ఖర్ మండిపడ్డారు. నేను రైతు కుమారుడిని, తలవంచబోనని అన్నారు. దేశం కోసం నేను ఏమైనా చేయగలను అని అన్నారు. ధంఖర్ ప్రకటనపై ప్రతిపక్షాలు కలత చెందాయి.. ప్రతిపక్ష నేత ఖర్గే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. ధంఖర్ తాను రైతు కొడుకు అని చెప్పగా.. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మీరు రైతు కొడుకు అయితే.. నేను కూలీ కొడుకును అని అన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం అందరికీ రావాలన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి గందరగోళంగానే సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు రాబోయే రెండు రోజులు చాలా కీలకం కానున్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేటి నుంచి ప్రత్యేక చర్చ మొదలైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. అదే సమయంలో, వయనాడ్ నుండి కొత్తగా ఎన్నికైన ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభలో తన మొదటి ప్రసంగం ద్వారా విపక్షాల నుండి బదులిచ్చారు.
రాజ్యాంగాన్ని తానే సృష్టించానని కొందరు అనుకుంటున్నారని.. అయితే అది ఏ ఒక్క పార్టీ సహకారం కాదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి.. కొంతమంది నాయకులు తమ జేబులో రాజ్యాంగ కాపీని తీసుకువెళుతున్నారని.. ఎందుకంటే వారికి చిన్నప్పటి నుండి అదే నేర్పించారని ఎద్దేవా చేశారు.
వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. బాబా అంబేద్కర్, మౌలానా ఆజాద్ జీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఆనాటి నాయకులందరూ ఈ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఏళ్ల తరబడి కృషి చేశారని అన్నారు. ప్రతీ ఒక్కరు తమ హక్కులను వినిపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారన్నారు. రాజ్యాంగం మన గొంతు అని.. అది కేవలం పత్రం కాదని అన్నారు. పెద్దగా మాట్లాడే అధికార పార్టీ మిత్రులు.. గత పదేళ్లుగా ఈ రక్షణ కవచాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించడం బాధాకరమని ప్రియాంక గాంధీ అన్నారు. లేటరల్ ఎంట్రీ, ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. లోక్‌సభలో ఈ ఫలితాలు రాకుంటే రాజ్యాంగాన్ని మార్చే పనిని ప్రారంభించి ఉండేవారు. దేశ ప్రజలే ఈ రాజ్యాంగాన్ని భద్రంగా ఉంచుతారని ఈ ఎన్నికల్లో తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా రాజ్యాంగాన్ని మార్చే మాటలు ఈ దేశంలో పనికిరావని గ్రహించారని అన్నారు.