కమల్ హాసన్ కి షాక్.. మక్కల్ నీది మయ్యం పార్టీకి కష్టాలు!
IT recovers Rs 11.50 crore in raids at premises of MNM Treasurer.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మక్కళ్ నీది మయ్యం
By తోట వంశీ కుమార్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ దూసుకు వెళ్తున్నారు. ఆయనకు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. విశ్వనటుడిగా సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన ఆయన ఇక రాజకీయాల్లో పెను మార్పులు తీసుకు వస్తానంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే పదేళ్లలో తమిళనాడును ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. విద్యారంగంలో మరింతగా మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. నిన్న మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. మహిళలు ప్రతి నెలా రూ.15 వేల వరకు సంపాదించుకునేలా వారికి నైపుణ్య శిక్షణ ఇస్తామని, మహిళా సాధికారతకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. యువతకు 50 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ కి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. మక్కళ్ నీది మయ్యం పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్‌పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది దేశాన్ని కుదిపేసిన కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం దేశ వ్యాప్తంగా మాస్క్‌లు, పీపీఈ కిట్ల, శానిటైజర్లకు విపరీతమైన మార్కెట్ లభించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాస్క్‌లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్‌కు చెందిన అనితా టెక్స్‌కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది.
తాజాగా ఈ సంస్థ పై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. ఎన్నికల సమయంలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ఓటు బ్యాంకు కోసం కమల్ ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన కొత్త కష్టాలు తెచ్చినట్టే అవుతుంది.