ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలం.. ఆ శాటిలైట్లు ఇక పనికిరావన్న ఇస్రో

ISRO said launch new rocket SSLV-D1 fails. ఇవాళ ఉదయం (2022 ఆగస్టు 7 ) నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్వీ డీ1 రాకెట్‌ ప్రయోగం విఫలమైందని భారత

By అంజి  Published on  7 Aug 2022 12:28 PM GMT
ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలం.. ఆ శాటిలైట్లు ఇక పనికిరావన్న ఇస్రో

ఇవాళ ఉదయం (2022 ఆగస్టు 7 ) నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్వీ డీ1 రాకెట్‌ ప్రయోగం విఫలమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. టర్మినల్‌ దశలో అదుపు తప్పిన రాకెట్‌.. నిర్దేశించి కక్ష్యలో కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టిందని తెలిపింది. దీంతో ఈఓఎస్‌-02, ఆజాదీ శాట్‌ శాటిలైట్లు ఇక పనికి రావని ఇస్రో తెలిపింది. ఈ రెండు శాటిలైట్లను నిర్ణయించిన కక్ష్య అయిన 356 కిలో మీటర్ల ఎత్తులో సర్క్యులర్ కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, 356 km x 76 km దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశించిందని ఇస్రో వివరించింది.

దీనివల్ల ఆ శాటిలైట్ల వల్ల ఉపయోగం ఉండబోదని ఇస్రో ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఇందుకు కారణాన్ని కూడా గుర్తించామని, రాకెట్‌లో సెన్సార్‌ వైఫల్యాన్ని గుర్తించి సాల్వేజ్‌ యాక్షన్‌కు వెళ్లడంలో లాజిక్‌ ఫెయిల్యూర్‌ అయిందని ఇస్రో వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక కమిటీ విశ్లేషించి సిఫారసు చేస్తుందని, ఈ రికమండేషన్స్‌ను అమలు పరిచి త్వరలో ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ2 ప్రయోగం చేపడతామని ఇస్రో ప్రకటించింది. ఈ అంశంపై ఇస్రో ఛైర్మన్ త్వరలో పూర్తి వివరణ ఇస్తారని ట్వీట్ చేసింది.

హ‌రికోట‌లోని స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్‌(షార్‌) మొద‌టి లాంచ్‌పాడ్ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 రాకెట్ ను ఆదివారం ఉద‌యం 9.18 గంట‌ల‌కు ప్ర‌యోగించారు. ఈ వాహ‌క నౌక ఆ‌జా‌దీ‌శాట్‌తోపాటు ఈఓఎస్‌-02 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈఓఎస్‌-02 ఉప గ్ర‌హం బ‌రువు 140 కిలోలు. ఇది మారుమూల ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీని అందించ‌డంలో సాయ‌ప‌డుంది. ఆజాదీశాట్ బ‌రువు 8 కిలోలు. దీన్ని 75 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు చెందిన 750 మంది విద్యార్థులు రూపొందించారు. 75వ స్వాత్రంత్య వార్షికోత్స‌వం, ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. దీని జీవిత కాలం ఆరు నెల‌లు.

Next Story