ఇక డ్రోన్ల అంతు చూసే వ్యవస్థ మన దగ్గర కూడా..!
Israeli Drone Guard sold to south Asian nation.ఇటీవల కాశ్మీర్ లో డ్రోన్లతో దాడి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే
By తోట వంశీ కుమార్ Published on 4 July 2021 5:47 AM GMTఇటీవల కాశ్మీర్ లో డ్రోన్లతో దాడి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! దీంతో భారత్ అప్రమత్తమైంది. జమ్మూ కాశ్మీర్ లో ఇటీవలి కాలంలో డ్రోన్ దాడుల విషయంలో ఆర్మీ అధికారులు అలర్ట్ అయ్యారు. జూన్ 27న జమ్ము ఎయిర్ బేస్ టెక్నికల్ ఏరియాలో డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో భారత వాయుసేన స్థావరంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) ఇక్కడ మోహరించినట్టు వాయుసేన వర్గాలు తెలిపాయి. దీంతోపాటే రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, సాఫ్ట్ జామర్ లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి. మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజ్వానీ ప్రాంతాల్లో డ్రోన్స్ గుర్తించారు. గత వారంలో జమ్ము ఎయిర్ పోర్టులోని వాయుసేన స్థావరంపై పాక్ ఉగ్రవాదులకు చెందిన డ్రోన్లు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే యాంటీ డ్రోన్ వ్యవస్థల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటన కూడా విడుదలైంది.
దక్షిణాసియాలోని ఓ దేశానికి యాంటీ డ్రోన్ వ్యవస్థ ఈఎస్ఐ-4030ని విక్రయించామని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) ఓ ప్రకటన చేసింది. ఏ దేశానికి తాము ఈ వ్యవస్థను విక్రయించామన్న విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించనప్పటికీ.. భారత్ అయి ఉంటుందని తెలుస్తోంది. కోట్ల డాలర్ల విలువైన ఈ డీల్ పూర్తయిందని, డ్రోన్ గార్డ్ విక్రయాన్ని ఇజ్రాయెల్ పూర్తి చేసుకుందని డిఫెన్స్ వార్తలను అందించే వార్తాసంస్థ జానెస్ వెల్లడించింది. ఈ వ్యవస్థ ఎప్పటికి డెలివరీ అవుతుందన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
తమవద్ద ఉన్న యాంటీ డ్రోన్ వ్యవస్థపై ఇండియా ఆసక్తిగా ఉందని గత సంవత్సరమే ఇజ్రాయెల్ ప్రకటించగా.. ఇప్పుడు ఆ అవసరం భారత్ కు ఉంది. ఎంతోకాలం నుంచి నమ్మకమైన రక్షణ భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి ఈ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ కు ఎలాంటి అడ్డంకులు కూడా లేవు. ఈ వ్యవస్థ దాదాపు 6 కిలోమీటర్ల రేంజ్ వరకూ పనిచేస్తుంది. డ్రోన్ నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి పనిచేసే సెన్సార్లు, 6 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తిస్తాయి. వాటిని గాల్లోనే పేల్చి వేస్తూ, రక్షణ వలయాన్ని కల్పిస్తాయి. భారత్ లోని పలు ప్రాంతాల్లో ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత్ భావిస్తోంది. విదేశాల్లోని ఎంబసీల వద్ద కూడా వినియోగించే అవకాశం ఉంది.