ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. భర్త నుంచి విడాకులు కావాలని డిమాండ్ చేసే ముస్లిం మహిళ హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని కేరళ హైకోర్టు పేర్కొంది. భర్త విడాకులకు అంగీకరించకపోయినా, భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఆ మహిళలకు భరణం ఇవ్వాలని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ ఎ ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సిఎస్ డయాస్‌తో కూడిన ధర్మాసనం ఓ కేసులో తీర్పు చెప్పింది. ముస్లిం మహిళ ఖులాను ఆశ్రయించే హక్కును గుర్తించిన కోర్టు.. తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో 59 పేజీల తీర్పును ధర్మాసనం వినిపించింది.
ముస్లిం మహిళ ఎప్పుడైనా తన వివాహ బంధాన్ని వదులుకోవచ్చు. పవిత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీకరిస్తుందని కోర్టు తెలిపింది. భర్త అంగీకారం ఉన్నా లేకున్నా విడాకులు తీసుకోవచ్చు అని కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక ముస్లిం భార్య తన భర్తతో తన వివాహాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే, ఆమె తన భర్త నుండి తలాక్ డిమాండ్ చేయాలని మరియు అతని తిరస్కరణపై ఆమె ఖాజీ లేదా కోర్టును ఆశ్రయించాలని రివ్యూ పిటిషన్‌లో వాదించారు. ముస్లిం మహిళకు తన ఇష్టానుసారంగా విడాకులు కోరే హక్కు ఉందని పిటిషనర్ అంగీకరించినప్పటికీ, ఖులా అని ఉచ్చరించే "పూర్తి హక్కు" ఆమెకు లేదని కూడా వాదించారు. ప్రపంచంలో ఎక్కడా ముస్లిం భార్య వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకునేందుకు అనుమతి లేదని పిటిషనర్ వాదించారు.