మీ ఆధార్ భద్రంగానే ఉందా?.. ఇలా తెలుసుకోండి
దేశంలో ఆధార్ కార్డే అన్నింటికీ ఆధారం. ప్రభుత్వ రాయితీల నుంచి సంక్షేమ పథకాల వరకు.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వరకు ప్రతి దానికీ ఆధార్ తప్పనిసరి.
By అంజి Published on 1 Feb 2024 1:47 PM ISTమీ ఆధార్ భద్రంగానే ఉందా?.. ఇలా తెలుసుకోండి
దేశంలో ఆధార్ కార్డే అన్నింటికీ ఆధారం. ప్రభుత్వ రాయితీల నుంచి సంక్షేమ పథకాల వరకు.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వరకు ప్రతి దానికీ ఆధార్ తప్పనిసరి. కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటే కూడా ఆధార్ కంపల్సరీ. అటువంటి ఆధార్‌ను భద్రంగా కాపాడుకోవడం ఎంతో అవసరం. ఇటీవల ఆధార్ కార్డును ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ఈ కార్డు విషయంలో ముందు జాగ్రత్త చాలా అవసరం. అందుకే మీ ఆధార్ భద్రతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం ఉత్తమం అని అధికారులు చెబుతున్నారు. దాని కోసం మీకు ఓ ఆప్షన్ అందుబాటులో ఉంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
యూనిక ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొచ్చింది. అదే ఆధార్ కార్డ్ యూసేజ్ హిస్టరీ. దీని ద్వారా మీ ఆధార్ కార్డు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వినియోగించారు? మీ ఆధార్ కార్డుకి ఏఏ డాక్యుమెంట్స్ లింకై ఉన్నాయి అనే విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం యూఐడీఏఐ వెబ్ పోర్టల్‌లో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది.
యూసేజ్ హిస్టరీ తెలుసుకోవడం ఎలా?
ముందుగా ఆధార్ uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
దానిలో My Aadhar ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
ఆ తర్వాత ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ కింద మీకు Aadhar Aunthetication History కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది.
దానిలో మీ 12 అంకెలతో కూడిన ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి
ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీఐ క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీ వస్తుంది.
దానిని ఎంటర్ చేస్తే మీకు మీ ఆధార్ కార్డ్ హిస్టరీ డౌన్‌లోడ్ అవుతుంది.
దీనిలో మీ ఆధార్ కార్డును ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించారు అనే విషయాలు పూర్తిగా ఉంటాయి. వాటిలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడైనా మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయ్యిందని మీకు అనిపిస్తే వెంటనే ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. వారికి మీ కార్డు దుర్వినియోగం అయిన విషయాలను తెలియజేయాలి. టోల్ ఫ్రీ నంబర్ 1947 లేదా help@uidai.gov.inకి ఈ మెయిల్ ద్వారా కూడా వీలైనంత త్వరగా యూఐడీఏఐకి ఫిర్యాదు చేయవచ్చు.