ఆ కార్యక్రమంలో 'జై శ్రీరామ్' నినాదాలు.. అసహనంతో సీఎం మమత ఏం చేశారంటే.!

Irked by ‘Jai Shri Ram’ slogans, CM Mamata refuses to go on stage. పశ్చిమ బెంగాల్‌లోని మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం

By అంజి  Published on  30 Dec 2022 10:02 AM GMT
ఆ కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలు.. అసహనంతో సీఎం మమత ఏం చేశారంటే.!

పశ్చిమ బెంగాల్‌లోని మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం ఉదయం బీజేపీ మద్దతుదారులు 'జై శ్రీరామ్' నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. జైశ్రీరామ్‌ నినాదాలతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేదిక పంచుకోవడానికి నిరాకరించారు. బదులుగా కార్యక్రమం అయిపోయేంత వరకు ఆమె వేదిక ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మృతి పట్ల ఆమె సంతాపం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఉదయం హౌరా స్టేషన్‌లోని వేదిక వద్దకు ముఖ్యమంత్రి మమత రాగానే అక్కడ ఉన్న బీజేపీ మద్దతుదారులు 'జై శ్రీరామ్' నినాదాలు చేశారు. వేదికపై ఉన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బిజెపి మద్దతుదారులను నియంత్రించడానికి తన శాయశక్తులా ప్రయత్నించారు. నినాదాలు చేయడం మానుకోవాలని వారిని అభ్యర్థించారు. అయితే వేదికపైకి రావడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. రైల్వే మంత్రి ఆమెను వేదికపైకి ఎక్కమని పదే పదే వేడుకోవడం కనిపించింది, దానికి ఆమె నిరాకరించింది.

వెంటనే రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ వేదిక వద్దకు చేరుకుని ముఖ్యమంత్రితో సంభాషించారు. ప్రారంభంలో, ఆమె ఈ సందర్భంగా తన ప్రసంగం చేయడానికి కూడా నిరాకరించింది. అయితే, గవర్నర్ పదేపదే చేసిన అభ్యర్థనలను అనుసరించి ఆమె ప్రసంగం చేయడానికి అంగీకరించారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేయడంపై ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. జనవరి 23, 2021న కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

కాగా శుక్రవారం ఉదయం జరిగిన ఈ పరిణామంపై రాజకీయ దుమారం చెలరేగింది. రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాలు & పట్టణాభివృద్ధి మంత్రి, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ.. ''జై శ్రీరామ్ అని స్వచ్ఛమైన మనస్సుతో దేవాలయంలో లేదా ఇంట్లో చెప్పాలి. కానీ బీజేపీ మద్దతుదారులు మాత్రం మన ముఖ్యమంత్రిని రెచ్చగొట్టేందుకు ఈ నినాదాన్ని ఉపయోగిస్తున్నారు'' అని మండిపడ్డారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు ప్రధాని ఆన్‌లైన్‌లో కనిపించినప్పుడు జై శ్రీరామ్ నినాదాలు లేవనెత్తారని బీజేపీ లోక్‌సభ సభ్యుడు లాకెట్ ఛటర్జీ అన్నారు. ముఖ్యమంత్రిని రెచ్చగొట్టేలా నినాదాలు చేయలేదని ఆమె అన్నారు.

Next Story