ప్రయాణీకులకు కీలక సూచన చేసిన ఐఆర్‌సీటీసీ
రైళ్లలో ఫుడ్ బుక్ చేసేటప్పుడు, ప్రయాణించేటప్పుడు అనధికారిక ఫుడ్ డెలివరీ విక్రేతలను నమ్మొద్దని IRCTC కోరింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 9:45 PM ISTప్రయాణీకులకు కీలక సూచన చేసిన ఐఆర్‌సీటీసీ
రైలు ప్రయాణీకులు జాగ్రత్త.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులు రైళ్లలో ఫుడ్ బుక్ చేసేటప్పుడు, ప్రయాణించేటప్పుడు అనధికారిక ఫుడ్ డెలివరీ విక్రేతలను నమ్మొద్దని కోరింది. అనధికార ఫుడ్ డెలివరీ విక్రేతల వెబ్‌సైట్ల జాబితాను కూడా విడుదల చేసింది. ప్రయాణికులను ఐఆర్‌సీటీసీ అలర్ట్ చేసింది. అనధికారిక ఫుడ్ డెలివరీ యాప్స్, వెబ్ సైట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ తీసుకు వచ్చిన ప్లాట్ ఫామ్స్ గురించి తెలిపింది. అనధికారికంగా ఫుడ్ డెలివరీ చేస్తోన్న వెబ్ సైట్ల జాబితాను తన ఈ-కేటరింగ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకుంది.
రైల్ రెస్ట్రో, రైలు మిత్ర, ట్రావెల్ ఖానా, రైల్ మీల్, దిబ్రెయిల్, ఖానా ఆన్ లైన, ట్రైన్స్ కేఫ్, ఫుడ్ ఆన్ ట్రాక్, ఈ-కేటరింగ్, ట్రైన్ మెనూ వంటి వెబ్ సైట్ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయవద్దని సూచించింది. ఆహారాన్ని ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేయాలని సూచించింది. ఈ వెబ్ సైట్లోకి వెళ్లి రైలు వివరాలు లేదా స్టేషన్ వివరాలు ఎంటర్ చేయాలని, ఆ తర్వాత పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి మీకు నచ్చిన ఫుడ్‌ను ఎంచుకోవాలని సూచించింది. పే ఆన్ లైన్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయని తెలిపింది. అలాగే 1323 నెంబర్‌కు కాల్ చేసి లేదా 91-8750001323 వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేయవచ్చునని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
IRCTC ఇ-కేటరింగ్ సేవ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది. కొన్ని ప్రధాన స్టేషన్‌లు న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, మధుర, CSMT, నాగ్‌పూర్, పాత ఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు సిటీ జంక్షన్, ఇటార్సీ జంక్షన్, చెన్నై సెంట్రల్, కాన్పూర్, వారణాసి ఇంకా ఎన్నో స్టేషన్స్ లో ఇ-కేటరింగ్ సేవ అందుబాటులో ఉంది.