రతన్ టాటాను 'ఉద్యోగ రత్న' అవార్డుతో సత్కరించిన మహారాష్ట్ర ప్ర‌భుత్వం

పారిశ్రామికవేత్త రతన్ టాటాను 'ఉద్యోగ రత్న' అవార్డు వ‌రించింది.

By Medi Samrat  Published on  19 Aug 2023 10:04 AM GMT
రతన్ టాటాను ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించిన మహారాష్ట్ర ప్ర‌భుత్వం

పారిశ్రామికవేత్త రతన్ టాటాను 'ఉద్యోగ రత్న' అవార్డు వ‌రించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు పారిశ్రామికవేత్త రతన్ టాటాను ఆయన నివాసంలో ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించారు. అనారోగ్యం కారణంగా రతన్ టాటా అవార్డు వేడుకలో పాల్గొన‌లేక‌పోవ‌డంతో ఇంటికి వెళ్లి స‌త్క‌రించారు.

రతన్ టాటాకు ఉద్యోగ రత్న అవార్డును ప్రదానం చేసేందుకు వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. రతన్ టాటా, టాటా గ్రూపు దేశానికి ఎనలేని సేవలందించాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డును స్వీకరించినందుకు ఆయనకు (రతన్ టాటా) ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 28న మొదటి 'ఉద్యోగరత్న' అవార్డును ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ వెల్లడించారు. యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, మరాఠీ పారిశ్రామికవేత్తలకు కూడా అవార్డులు అందజేస్తామని సామంత్ రాష్ట్ర శాసన మండలిలో తెలిపారు.

విశిష్ట వ్యక్తులకు ఇచ్చే మహారాష్ట్ర భూషణ్ అవార్డు మాదిరిగానే రతన్ టాటాను ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్, పరిశ్రమల శాఖ మంత్రితో కూడిన కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story