స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్ నెట్ అందుబాటులోకి రావడంతో గతంతో పోలిస్తే నేడు క్షణాల్లోనే సమాచార మార్పిడి జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా కొన్ని తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకట్టవేసేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో బాగంగా తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోన్న పలు యూట్యూబ్ ఛానళ్లపై ఇప్పటికే నిషేదం విధించగా.. తాజాగా మరో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది. ఇందులో 7 భారత్‌కు చెందినవి కాగా.. మరోకటి పాకిస్థానీ ఛానల్ ఉంది.
ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖ ఐటీ చట్టం 2021 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓప్రకటనలో తెలిపింది. 8 యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఒక ఫేస్ బుక్ అకౌంట్, రెండు ఫేస్‌బుక్ పోస్ట్‌లను తొలగించింది. ఈ 8 యూట్యూబ్ ఛానళ్లకు 85 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా 114 కోట్ల మంది ఆ వీడియోలను వీక్షించారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు, కొన్ని వర్గాల మధ్య ద్వేషం పెంచేలా వీడియోలు ప్రసారం చేస్తున్నందుకు ఈ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్‌తో పాటు పలు ఇతర అంశాలపై తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కేంద్రం బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానళ్ల సంఖ్య 102కు చేరుకుంది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని బలహీనపర్చేలా సోషల్ మీడియా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరింది.