డార్క్ వెబ్‌లో అమ్మకానికి 81.5 కోట్ల మంది ఆధార్ డేటా
దేశ చరిత్రలో అతి పెద్ద డేటా లీక్ కలకలం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 31 Oct 2023 10:33 AM ISTడార్క్ వెబ్‌లో అమ్మకానికి 81.5 కోట్ల మంది ఆధార్ డేటా
దేశ చరిత్రలో అతి పెద్ద డేటా లీక్ కలకలం సృష్టిస్తోంది. ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోసారి నిజమని నిరూపితం అయ్యింది. 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సమాచారం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచారు. ICMR వద్ద ఉన్న 81.5 కోట్ల మంది భారతీయుల డేటా డార్క్ వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచారు. ఇందులో ఆధార్, పాస్‌పోర్టు వివరాలతో పాటు పేరు.. ఫోన్ నెంబర్, అడ్రెస్ వంటి ఇంపార్టెంట్ సమాచారం మొత్తం హ్యాకర్లు 'బ్రీచ్ ఫోరమ్స్'పై పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఆధార్ డేటా చోరీ అంశాన్ని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ, నిఘా విభాగం 'రీసెక్యూరిటీ' సంస్థ ముందుగా బయటపెట్టింది. అక్టోబర్ 9న PWN0001 అనే మారుపేరుతో పిలిచే ఒక వ్యక్తి 81.5 కోట్ల మంది భారతీయ పౌరుల ఆధార్, ఆధార్ వివరాలను ఉల్లంఘన ఫోరమ్‌లో పోస్ట్ చేసినట్లు రీ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. అంతేకాదు.. సదురు వ్యక్తి డాటా తమ వద్ద ఉందన్న దానికి రుజువుగా నాలుగు శాంపిల్స్‌ను కూడా బయటపెట్టారు. ఒక్కో శాంపిల్‌లో లక్ష మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో.. భారతీయుల వ్యక్తిగత డేటా చోరీకి గురైందన్న వార్తలు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తగా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
అయితే.. భారత ఆరోగ్య వ్యవస్థపై హ్యాకర్లు దాడులు చేయడం ఇది మొదటిసారేం కాదు.. గతేడాది ఢిల్లీలోని ఎయిమ్స్‌పైనా సైబర్ దాడులు జరిగాయి. సర్వర్లన్నింటినీ తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులన్నీ ప్రభావితం చేశారు. ఇక ఇప్పుడు కోవిడ్ పరీక్షలు జరిపిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయా వైద్య సంస్థలు సేకరించిన పౌరుల వివరాలు ఐసీఎంఆర్‌కు, జాతీయ సమాచార కేంద్రానికి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందించారు. ఈ మూడు ప్రదేశాలలో ఎక్కడి నుంచి డాటా చోరీ అయిందో తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
లీక్ అయిన డేటాలో లక్ష ఫైల్స్ ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. డాటా చోరీ విషయం తెలిసిన వెంటనే వివిధ ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) డేలా లీక్ గురించి ICMRని అప్రమత్తం చేసింది. అమ్మకానికి కోసం విడుదల చేసిన డేటాను ICMR ప్రధాన డేటాతో సరిపోల్చాలని ఏజెన్సీ కోరింది.