అరుణచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రంలో గురువారం ఉదయం భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. మండలా హిల్స్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. సెంగే గ్రామం నుంచి మిసామారీకి వెళ్తుండగా మార్గం మధ్యలో ప్రమాదం జరిగినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. రోజూవారీ విధుల్లో భాగాంగానే మిసామారీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, హెలికాప్టర్‌లో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ ఉన్నారని తెలిపింది. పర్వత ప్రాంతంలో వారిద్దరూ గల్లంతయ్యారని, వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని ఆర్మీ తెలిపింది.
గురువారం ఉదయం 9.15 గంటలకు అరుణచల్‌ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఆర్మీ తెలిపింది. బోమ్‌డిలాకు పశ్చిమంగా ఉన్న మండలా హిల్స్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలినట్లు వెల్లడించింది. ఆ ప్రాంతం పూర్తిగా పొగమంచుతో కప్పబడి ఉంది. కేవలం ఐదు మీటర్ల వరకు కనిపిస్తోందని లోకల్ పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.