అలర్ట్.. భారత్‌లో రెండో మంకీపాక్స్ కేసు నమోదు

భారత్‌లో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదు అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  18 Sep 2024 3:30 PM GMT
అలర్ట్.. భారత్‌లో రెండో మంకీపాక్స్ కేసు నమోదు

వైరస్‌ అంటేనే జనాలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్‌ తర్వాత జనాలను వైరస్‌లు వెంటాడుతున్నాయనే చెప్పాలి. తాజాగా మంకీపాక్స్‌ అనే వైరస్‌ ప్రపంచంలోని పలు దేశాల్లో విజృంభిస్తోంది. తాజాగా ఇది భారత్‌కు వచ్చేసింది. ఇప్పటికే భారత్‌లో ఒక కేసు నమోదు అవ్వగా.. తాజాగా రెండో కేసు నమోదు అయ్యింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ మంకీపాక్స్ వైరస్ సోకినట్లు కేరళ ఆరోగ్య శాఖ చెప్పింది. మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడని మంత్రి వీణా జార్జ్ చెప్పారు.

విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్‌ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. త్వరగా చికిత్స పొందాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ వైరస్ బారిన పడిన వారు వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా కోలుకునేందుకు అకాశాలు చాలానే ఉన్నాయి. ఒక వేళ వైద్యం చేయడం లేట్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుక్కోవాల్సి ఉంటుంది. అయితే.. బాధితుడు ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి.. తన కుటుంబం నుంచి ఐసోలేట్‌ అయ్యాడని పేర్కొన్నారు. ప్రస్తుతం మంజేరి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించార.

భారత్‌లో సెప్టెంబర్‌ 9న తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్‌-2 రకంగా నిర్ధారించారు. 1958లో డెన్మార్క్‌లో మంకీపాక్స్‌ ను తొలిసారి కోతుల్లో వెలుగు చూసింది. 1970లో మానవుల్లో తొలిసారి గుర్తించారు. ఇక ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. మరణాలు కూడా పెద్ద ఎత్తున సంభవించాయి. ఇక తాజాగా భారత్‌లో మరో కేసు కూడా వెలుగులోకి రావడంతో అప్రమత్తం అయ్యారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story