దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో నాలుగు వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కేసులు నమోదు అయ్యాయి. 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
ప్రస్తుతం దేశంలో 23,091 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళ, మహారాష్ట్రలో నలుగురు, ఢిల్లీ, చత్తీస్‌గడ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పుదుచ్చేరి, రాజస్థాన్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,916కి చేరింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220.66 (220,66,16,373) కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. అందరూ కరోనా నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరింది.