భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,41,299 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 3,82,315 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,780 మంది మరణించారు.
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,26,188కి చేరింది. నిన్న 3,38,439 మంది కోలుకోగా.. మొత్తంగా కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 1,69,51,731కి చేరింది. ప్రస్తుతం దేశంలో 34,87,229 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 29.48కోట్ల టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 16,04,94,188 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.