దేశంలో భారీగా పెరిగిన కేసులు.. ఐసోలేషన్ వార్డులుగా రైల్వే కోచ్‌లు

India's new corona cases today.భార‌త్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 17,19,588 టెస్టులు చేయ‌గా.. 3,49,691 పాజిటివ్ కేసులు న‌మోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2021 5:32 AM GMT
India corona cases

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా దేశంలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 17,19,588 టెస్టులు చేయ‌గా.. 3,49,691 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,767 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,92,311కి చేరింది. నిన్న 2,17,113 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1, 40,85,110 కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా ఐసోలేషన్‌ వార్డులుగా రైల్వే బోగీలు..

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌తి రోజు ఎంతో మందిని గ్యమస్థానాలకు చేర్చే రైలు బోగీలు మళ్లీ ఐసోలేషన్‌ వార్డులుగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి మొదటి విడుతలో ఆసుపత్రుల్లో బెడ్ల కొరతతో కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చింది. సెకండ్‌ వేవ్‌లో కరోనా పంజా విసురుతుండడంతో ఇప్పటికే రాష్ట్రాల్లోని ఆస్ప‌త్రుల్లో పడకలు నిండిపోయాయి. ఈ క్రమంలో మరోసారి రైల్వే ముందుకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో 3,816 రైల్వే కోచ్‌లను కొవిడ్‌-19కేర్‌ కోచ్‌లుగా మార్చినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్‌ మేరకు కోచ్‌లను మోహరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లాలో 21 కొవిడ్ -19 కేర్ కోచ్‌లను మోహరించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. షుకుర్‌ బస్తీ వద్ద 25, ఆనంద్ విహార్‌లో 25, వారణాసిలో 10, భడోహిలో పది, ఫైజాబాద్ వద్ద 10 కొవిడ్-19 కేర్ కోచ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాల్లో భాగంగా మొత్తం 5,601 రైల్‌ కోచ్‌లను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారుస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం 3,816 కోచ్‌లు వినియోగానికి అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.


Next Story