దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. గత కొద్ది రోజులు దేశంలో రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికి.. మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 20,08,296 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,67,334 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,96,330కి చేరింది.
నిన్న ఒక్క రోజే 4,529 మంది కరోనాతో మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రోజు వ్యవధిలో ఇంత మంది మృతి చెందడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,83,248కి చేరింది. నిన్న 3,89,851 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 2,19,86,363కి చేరింది. ప్రస్తుతం దేశంలో 32,26,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశంలో టీకా డ్రైవర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18,58,09,302 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.