దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి తీవ్రంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,66,394 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,61,500 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,88,109కి చేరింది. నిన్న ఒక్క రోజే 1501 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటికి ఒక్క రోజు వ్యవధిలో ఇంత మంది మృత్యువాత పడడం ఇదే తొలిసారి. ఇక ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1,77,150కి చేరింది.
నిన్న 1,38,423 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,28,09,643కి చేరింది. దేశంలో ప్రస్తుతం 18,01,316 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. నిన్న 26.84 లక్షల మందికి పైగా టీకాలు వేయగా.. మొత్తంగా టీకాలు పొందిన వారి సంఖ్య 12.26కోట్లు దాటింది.