దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. రోజువారి కేసులు వారం రోజుల వ్యవధిలో వెయ్యి నుంచి 2వేల మార్క్‌ను చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,42,497 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 2,151 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఐదు నెలల తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత సంవత్సరం అక్టోబర్ 28న 2,208 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం దేశంలో 11వేల 903 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కరోనాతో మహారాష్ట్రలో ముగ్గురు, కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5,30,848కి చేరింది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.3శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.78శాతం ఉండగా, మరణాల శాతం 1.19గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు.
కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మందులు, వైద్య పరికరాలు, ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలపై మానవ వనరుల సామర్థ్యం పెంపుదల, టీకా పంపిణీ వంటి వాటిని సంసిద్ధం చేసుకోవాలని సూచించింది.