భారత్‌లో కరోనా తీవ్రరూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. నేడు కూడా అదే పంథా కొనసాగింది. గడచిన 24 గంటల వ్యవధిలో 2,00,739 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,037 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,73,123 మందికి చేరింది. నిన్న ఒక్క రోజే 93,528 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య కోటి 24 లక్షలను చేరింది.
కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజే లక్షకు పైగా కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే భారత్‌లో కరోనా రెండో వేవ్ కొనసాగుతుండగా.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యతో పోలిస్తే, రికవరీల సంఖ్య తక్కువగా ఉండటం అధికారులు, ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాటు, 12వ తరగతి పరీక్షలను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.