దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 17,28,795 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 43,509 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.15కోట్లకు చేరింది. నిన్న ఒక్క రోజే 640 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4.22లక్షలకు చేరింది.
నిన్న 38,465 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,07,01,612 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,03,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.38శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.38శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.52 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 43,92,697 మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 45,05,49,356 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.