దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. నిన్న 2వేల కేసులు నమోదు కాగా నేడు ఆ సంఖ్య 3 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 3,016 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే నేడు దాదాపు 40 శాతం అధికంగా నమోదు అయ్యాయి.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,509 కి చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు 2.7శాతంగా ఉండగా, వీక్లి సానుకూలత రేటు 1.71శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 14 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,862కి చేరింది. రికవరీ రేటు 98.78శాతంగా ఉంది.
కరోనా కేసులు పెరుగుతుండడంతో అనేక రాష్ట్రాలు అత్యవసర సమావేశాలను నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఈ రోజు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
మహారాష్ట్రలోని ముంబై, పూణే, థానే మరియు సాంగ్లీ వంటి అనేక జిల్లాల్లో కూడా కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి.