ఇండియా పోస్ట్ కొత్త సర్వీసులు.. 24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్
సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం తపాలా శాఖ '24 స్పీడ్ పోస్ట్' సేవలను మార్చి 17 (మంగళవారం) నాడు అధికారికంగా ప్రారంభిస్తోంది.
By - అంజి |
ఇండియా పోస్ట్ కొత్త సర్వీసులు.. 24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్
సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం తపాలా శాఖ '24 స్పీడ్ పోస్ట్' సేవలను మార్చి 17 (మంగళవారం) నాడు అధికారికంగా ప్రారంభిస్తోంది. ఈ సేవ ద్వారా పంపిన పోస్టులు మరుసటి రోజుకే (Next-Day) గ్యారెంటీగా డెలివరీ చేయబడతాయి. వీటితో పాటు '24', '48' స్పీడ్ పోస్ట్ సర్వీసుల ద్వారా బుక్ చేసిన రోజు నుంచి ఒకటి (D+1) లేదా రెండు (D+2) రోజుల్లోనే కచ్చితంగా గమ్యస్థానానికి చేరేలా ప్రత్యేక విభాగాలు, విమాన రవాణా సదుపాయాలను కేటాయించారు.
మొదటి విడతలో ఆరు నగరాలు:
ఈ ప్రతిష్టాత్మకమైన సేవలు తొలి దశలో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా మరియు బెంగళూరు నగరాల మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ డెలివరీ సదుపాయం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఈ సేవలను ఇతర నగరాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వినియోగదారుల భద్రత, నమ్మకం కోసం ఈ సేవలలో పలు కొత్త ఫీచర్లను జోడించారు. ఓటీపీ (OTP) ఆధారిత సురక్షిత డెలివరీ, ఎస్ఎంఎస్ ద్వారా ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటాయి. వ్యాపారవేత్తల కోసం 'బుక్ నౌ - పే లేటర్' (BNPL) సదుపాయం, బల్క్ బుకింగ్స్‌కు ఉచిత పికప్, ఏపీఐ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, నిర్ణీత సమయంలోగా డెలివరీ కాకపోతే 'మనీ-బ్యాక్ గ్యారెంటీ' (డబ్బు తిరిగి ఇచ్చే) సౌకర్యాన్ని కూడా తపాలా శాఖ ప్రకటించింది.
న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్ గల రంగభవన్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీగా ఇండియా పోస్ట్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది.