రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌లు నిషేధం!
చిన్నారుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ (IPC) కీలక నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌లు నిషేధం!
చిన్నారుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ (IPC) కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు, జలుబు సిరప్‌లను ప్రిస్క్రైబ్ చేయకుండా వైద్యులపై నిషేధం విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు 'నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026' ముసాయిదాలో నిబంధనలను పొందుపరిచినట్లు నివేదికలు వెల్లడించాయి. కొన్ని ఔషధ బ్యాచ్‌లలో ప్రమాదకరమైన రసాయన అవశేషాలు (Contaminants) కలవడం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురికావడమే కాకుండా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతంలో గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో సుమారు 140 మంది చిన్నారులు, అలాగే భారత్‌లో 2025 చివరలో 24 మంది చిన్నారులు కలుషిత సిరప్‌ల కారణంగా మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ముసాయిదాలోని ముఖ్యాంశాలు:
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వడంపై పూర్తిస్థాయి పరిమితులు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల నిశిత పరిశీలనలో మాత్రమే అనుమతి ఉంటుంది. ఔషధ తయారీలో వాడే గ్లిజరిన్, ప్రోపిలీన్ గ్లైకాల్ వంటి ద్రావణాలలో విషపూరితమైన 'డైథైలిన్ గ్లైకాల్ (DEG)', 'ఇథైలిన్ గ్లైకాల్ (EG)' వంటివి కలవకుండా ప్రతి బ్యాచ్‌ను ల్యాబొరేటరీల్లో క్షుణ్ణంగా పరీక్షించాలి. ఫార్మా కంపెనీలు తాము వాడే ముడి పదార్థాలతో పాటు తుది ఉత్పత్తులను కూడా స్వతంత్రంగా పరీక్షించి, రికార్డులను నిర్వహించడం తప్పనిసరి. మందుల మోతాదు (Dosage), దుష్ప్రభావాలు (Side effects) వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను NFI 2026 ద్వారా రూపొందిస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలపై ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IDMA) వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. త్వరలోనే వీరు తమ అధికారిక అభిప్రాయాలను ప్రభుత్వానికి అందజేయనున్నారు.
------------------------------------------------------------------------