భారత్‌లో మరో టీకాకు ఆమోదం.. 90 శాతం సమర్థత
India opens gate for Moderna Covid-19 vaccine as Cipla gets DCGI nod.కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2021 4:39 PM ISTకరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఒక వేవ్ తరువాత మరో వేవ్ రూపంలో ప్రజలను వణికిస్తోంది. ఈమహమ్మారిని పూర్తిగా అరికట్టడానికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కొరత ఉండడంతో.. దీన్ని అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్లు కూడా అనుమతి ఇస్తుంది. ప్రస్తుతం మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యాక్సిన్.. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ మాత్రమే ఉన్నాయి. తాజాగా దేశంలోకి మరో విదేశీ టీకా వచ్చేస్తోంది.
అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ దిగుమతితో పాటు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.. మోడెర్నా వ్యాక్సిన్‌ను ముంబైలోని ఫార్మాసూటికల్ కంపెనీ సిప్లా దిగుమతి చేసుకోనుంది. సోమవారమే ఈ సంస్థ దీనికోసం డీసీజీఐ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. ఇవాళ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మోడెర్నా అనేది మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) వ్యాక్సిన్. ఇది కరోనా బాధితులపై 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. దీంతో భారత్‌లో నాలుగో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ పరిమితులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. టీకా పంపిణీ చేపట్టిన తరువాత తొలి 100 లబ్ధిదారులకు సంబంధించిన 7 రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించాల్సి ఉంటుంది అని అధికార వర్గాలు పేర్కొన్నాయి.