'భారత్ మాతాకీ జై'..చర్చనీయాంశంగా అమితాబ్ సోషల్‌మీడియా పోస్టు
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Sep 2023 12:22 PM GMT'భారత్ మాతాకీ జై'..చర్చనీయాంశంగా అమితాబ్ సోషల్‌మీడియా పోస్టు
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇండియా గా కాంకుడా కేవలం భారత్‌గా మన దేశాన్ని సంబోధించేలా కేంద్ర కసరత్తులు చేస్తోంది. అంతేకాదు.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ భారత్ మాతాకీ జై అంటూ పోస్టు పెట్టారు. రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో బిగ్‌బీ పెట్టిన పోస్టు చర్చకు దారి తీసింది.
అమితాబ్‌బచ్చన్ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతు పలుకుతుంటే.. ఇంకొందరు మాత్రం 'జయా జీ అంటే మీకు భయం లేదా సార్' అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఇండియా పేరును పూర్తిగా వాడుకలో లేకుండా కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని.. ఇది ఏమాత్రం సరికాదని కాంగ్రెస్ వాదిస్తోంది. మోదీ ప్రభుత్వం వ్యవహారాన్ని తప్పుబడుతోంది. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకే కుట్రలు పన్నుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇండియా, భారత్ అంటే ఒక్కటే అని అంటున్నారు.
భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా జీ20 సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కార్యాలయం నుంచి లెటర్ విడుదలైంది. ఆహ్వాన పత్రాల్లో ఇంతకు ముందు ఉండే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. దాన్ని కూడా కాంగ్రెస్ నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే.. జీ20 సమావేశాల వేదికగా ఇండియా పేరుని భారత్‌గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బానిసత్వానికి సంబంధించిన ప్రతి ముద్రను చెరిపేసుకుంటామని అన్నారు. తాజాగా ఈ నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన ఉందని భావిస్తున్నారు. గతంలోనూ ఇండియా పేరును పూర్తిగా భారత్‌గా మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. 2016లో జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ఈ పిల్‌ను తోసిపుచ్చింది. భారత్ అని పిలిచినా, ఇండియా అని పిలిచినా తప్పు లేదని పేర్కొంది. 2020లోనూ ఇలాంటి పిటిషనే దాఖలు అయితే.. విచారణకు ధర్మాసనం నిరాకరించింది. భారత్, ఇండియా రెండు పేర్లను రాజ్యాంగంలో ఇచ్చారని గుర్తు చేసింది.
T 4759 - 🇮🇳 भारत माता की जय 🚩
— Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023