దేశంలో ఇప్పుడు నిర్భయ, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉంది : రాష్ట్రపతి ముర్ము
India Has Fearless and Decisive Government Today says President.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ సెషన్ ప్రారంభం
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2023 12:55 PM ISTరాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశంలో ఈ రోజు నిర్భయ, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం త్వరలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ రోజు అతిపెద్ద మార్పు ఏమిటంటే.. ప్రతి పౌరుడిలో విశ్వాసం పెరిగింది. నేడు భారతదేశం ప్రపంచ సమస్యలకు పరిష్కారంగా మారుతోందన్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు తీసుకువస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ ముందుకు సాగుతోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదలు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
చిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్, ఫసల్ భీమా యోజన వంటి ఫథకాలు తీసుకువచ్చాం. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నాం. కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి వేళ ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
ఇక మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. బేటీ బచావో, బేటీ పడావో విజయవంతం అయినట్లు తెలిపారు. మహిళల ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడినట్లు చెప్పారు. గతంలో ట్యాక్స్ రిఫండ్స్ కోసం చాలా కాలం ఎదురుచూసేవాళ్లమని, అయితే ఇప్పుడు కేవలం కొన్ని రోజుల్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్స్న్ వస్తున్నాయన్నారు. మూడు కోట్ల మందికి ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు.
జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక అంశాల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్థిరమైన, భయంలేని, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం అధికారంలో ఉందని, పెద్ద కలల్ని ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు చెప్పారు. పేదరికం లేని భారత్‌ను నిర్మించాలని బావిస్తున్నట్లు రాష్ట్రపతి ముర్ము తెలిపారు.