ఇండియాలో ఫస్ట్‌ ప్రైవేట్‌ రైలు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..

ఇండియాలో తొలి ప్రయివేటు రైలు ప్రారంభం కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on  8 May 2024 7:13 AM IST
india, private train,  kerala,  goa,

 ఇండియాలో ఫస్ట్‌ ప్రైవేట్‌ రైలు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..

ఇండియాలో తొలి ప్రయివేటు రైలు ప్రారంభం కాబోతుంది. జూన్‌ 4వ తేదీ నుంచి ఈ రైలు పట్టాలు ఎక్కబోతుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు దీని రాకపోకలు సాగనున్నాయి. ఎస్‌ఆర్‌ఎంపీఆర్‌ గ్లోబల్‌ రైల్వేస్‌ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసుని నిర్వహిస్తుంది. భారత్‌ గౌరవ్‌ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంయుక్త సహకారంతో ఈ రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి ప్రయివేటు రైలు కావడంతో ప్రజలు కూడా దీనిపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సదుపాయాలు మరింత ఎక్కువగా ఏమైనా కల్పిస్తారా అని అనుకుంటున్నారు. మరోవైపు టికెట్‌ ధర ఇతర రైళ్లలో లాగానే ఉంటుందా..? లేదంటే సదుపాయాలు ఎక్కువ కల్పించి ధరను పెంచుతారా? అనే ప్రశ్నలు సామాన్యుల్లో మెదులుతుంది.

కేరళలోని తిరువనంతపురంలో ఈ ట్రైన్‌ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌ మీదుగా గోవాకు చేరుకుంటుంది. ఈ రైల్లో రెండు స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లు ఉంటాయని చెబుతున్నారు. ఒక ఒకేసారి ఈ ట్రైన్‌లో 750 మంది వరకు ప్రయాణికులు వెళ్ల వచ్చని అంటున్నారు. వైద్య నిపుణులతో సహా మొత్తం ఈ రైలులో 60 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. భోజన వసతి కల్పించడంతో పాటు.. వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ వంటివి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా టూర్‌ ప్యాకేజీలను రెడీ చేస్తున్నామని ఎస్‌ఆర్‌ఎంపీఆర్‌ గ్లోబల్‌ రైల్వేస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

Next Story