భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 16,10,829 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 27,176 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కి చేరింది. నిన్న ఒక్క రోజే 284 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,43,497కి చేరింది.
నిన్న 38,012 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,25,22,171కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,51,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.62శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 61,15,690 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 75,89,12,277 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.