భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 12,66,589 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 11,850 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,26,036కి చేరింది. నిన్న ఒక్క రోజే 555 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,63,245కి చేరింది.
నిన్న 12,403 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,38,26,483కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,36,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.26 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 58,42,530 మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 1,11,40,48,134 పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.