థర్డ్ వేవ్ అనివార్యం.. 6 నుంచి 8 వారాల్లో ..!
India could see third wave in 6-8 weeks.భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని.. వచ్చే 6 నుంచి 8 వారాల్లో సంక్రమణ
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2021 9:28 AM ISTభారత్‌లో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని.. వచ్చే 6 నుంచి 8 వారాల్లో సంక్రమణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. అయితే.. ప్రజలు కరోనా నిబంధనలను పాటించడం, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా ఉండడం లాంటి జాగ్రత్తలను ఏ మేరకు అవలంభిస్తారనే దానిపైనే థర్డ్ వేవ్ ఆధారపడి ఉంటుందన్నారు.
'దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. జనం మళ్లీ సమూహాలుగా ఏర్పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరిగింది. కొవిడ్ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదు. ఈ ప్రభావంతో కేసులు పెరగడానికి కొంత సమయం పడుతుంది. పరిస్థితులు చూస్తుంటే.. థర్డ్ వేవ్ అనివార్యం అనిపిస్తోంది. ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల్లోనే రావచ్చు. లేదా మరికొంత ఆలస్యం కావచ్చు. అంతేగానీ.. రావడం మాత్రం తథ్యం. ఇదంతా.. జనసమూహాలను నియంత్రించడంలో, కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుంది' అని గులేరియా చెప్పారు.
ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ గతంలోని వేరియంట్స్‌తో పోలిస్తే మరింత బలమైంది. దీని సంక్రమణ వేగం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. యూకేలో డెల్టా వేరియంట్ మ్యూటేషన్ చెందుతోంది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కరోనా వేవ్స్ మధ్య గ్యాప్ తగ్గిపోతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం' అని గులేరియా అన్నారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వ్యాక్సినేషనే అని, అధిక శాతం జనాభాకు వ్యాక్సిన్ అందించడం ద్వారానే కరోనాను నియంత్రించగలమన్నారు. ఇందుకోసం కొవిషీల్డ్ డోసుల మధ్య విరామం పెంచడం మంచి ఎత్తుగడేనని, దీని ద్వారా మరింత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ద్వారా రక్షణ కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు.