భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 12,52,596 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 8,603 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,24,360కి చేరింది. నిన్న ఒక్క రోజే 415 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,70,530కి చేరింది. నిన్న8,190 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,40,53,856కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 99,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.35 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 73.6లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 126కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.