దేశంలో కరోనా కలవరం, ఒకే రోజు 12 మంది మృతి
దేశంలో మరోసారి కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. కొద్దిరోజలుగా వరుసగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 3:45 PM ISTదేశంలో కరోనా కలవరం, ఒకే రోజు 12 మంది మృతి
దేశంలో మరోసారి కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. కొద్దిరోజలుగా వరుసగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అధికారులు ప్రజలను ఎన్ని విధాలుగా అప్రమత్తం చేసినా కూడా కరోనా పాజిటివిటీ రేటు పెరుగోతంది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 761 కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో పాటు ఒక్కరోజులోనే కరోనా బారిన పడ్డ 12 మంది చనిపోయారని తెలిపింది. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులే పెరుగుతున్నాయనీ అందరూ అనుకుంటుంటే..కరోనా మరణాలు కూడా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 761 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు అదే 24 గంటల వ్యవధిలో 12 మంది చనిపోయారనీ వెల్లడించింది. కాగా.. రికవరీ రేటు కూడా బాగానే ఉంది. ఒక్కరోజే 838 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ్యాప్తంగా 4,334 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో చనిపోయిన 12 మందిలో ఐదుగురు కేరళకు చెందినవారు కాగా.. కర్ణాటకు చెందిన నలుగురు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, యూపీకి చెందిన ఒకరు ఉన్నారు. తద్వారా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య మొత్తం 5,33,385కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 0.01శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కోవిడ్ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందనీ.. మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా మరోసారి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు వైద్యాధికారులు. కరోనా వ్యాప్తి పెరగకుండా చేయాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉంటుందని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని.. ప్రజలకు ఇప్పటికే ఏం చేయాలో తెలుసు కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.