దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 14శాతం అధికంగా నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18,17,639 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 43,263 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,31,39,981కి చేరింది. నిన్న ఒక్క రోజే 338 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,41,749కి చేరింది.
24 గంటల వ్యవధిలో 40,567 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,23,04,618కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,93,614 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.48శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.43శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.38 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 86,51,701 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 71,65,97,428 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.