దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,92,135 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 33,376 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కి చేరింది. నిన్న ఒక్క రోజే 308 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,42,317కి చేరింది.
24 గంటల వ్యవధిలో 32,198 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,23,74,497కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,91,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.49శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.26శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.10 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 65,27,175 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 73,05,89,688 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.