భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఓ రోజు పెరిగితే మరో రోజు కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 12,84,552 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 14,348 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157కి చేరింది. నిన్న ఒక్క రోజే 805 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,57,191కి చేరింది. నిన్న 13198 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,36,27,632కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,61,334 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 74,33,392 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 1,04,82,00,966 టీకా డోసులను పంపిణీ చేశారు.