దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. క్రితం రోజుతో పోలిస్తే నేడు 14 శాతం మేర కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 8,10,783 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,929 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,43,44,683కి చేరింది. నిన్న ఒక్క రోజే 392 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,60,265కి చేరింది.
నిన్న 12,509 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,37,37,468కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,46,950 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.23 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 20,75,942 మందికి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 1,07,92,19,546 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.