దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసు సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 11,65,286 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 12,516 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,14,187కి చేరింది. నిన్న ఒక్క రోజే 501 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,62,690కి చేరింది.
నిన్న 13,155 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,38,14,080కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,37,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.26 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 53,81,889 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 110కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.