భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ..!
India-China soldiers clash at Naku La in Sikkim.భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2021 1:10 PM ISTభారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా దశాలు మరో దుస్సాహసాకి ఒడిగట్టాయి. మూడు రోజుల క్రితం చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడేందుకు యత్నించగా.. భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు భారత జవాన్లు గాయపడగా.. 20 మంది చైనా సైనికులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన సిక్కిం సెక్టార్‌లోని నాథూ లా సమీపంలోని లైన్ ఆప్ యాక్సువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ ఘటనపై భారత సైన్యం అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. జనవరి 20న ఉత్తర సిక్కింలోని నకులా ప్రాంతంలో భారత్-చైనా జవాన్ల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుందని తెలిపారు. అయితే.. స్థానిక కమాండర్ల జోక్యంతో సమస్య అప్పుడే పరిష్కారమైందన్నారు.
అయితే.. ఆదివారం భారత్, చైనా మధ్య తొమ్మిదవ రౌండ్ సైనిక చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ముందే ఈ ఘర్షణ జరిగింది. మారథాన్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు దాదాపు 16 గంటలు కొనసాగాయి. తూర్పు లడఖ్‌లోని అన్ని ఘర్షణ ప్రాంతాల నుండి దళాలను వెనక్కి పంపడంపైనే దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి 2:30 గంటలకు ముగిసినట్టు తెలుస్తోంది.