రామ్ దేవ్ బాబాపై ప్ర‌ముఖ సంస్థ ఆగ్ర‌హం.. లీగ‌ల్ నోటీసులు..!

IMA demands action against Ramdev.ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అల్లోపతి వైద్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ప‌డ్డారు. బాబాకు లీగల్ నోటీసులు పంపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 May 2021 2:14 AM GMT
Ramdev

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అల్లోపతి వైద్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ప‌డ్డారు. అల్లోప‌తి వైద్య శాస్త్రం, వైద్యుల‌ను అవ‌మానించేలా మాట్లాడార‌ని భార‌త వైద్య సంఘం (ఐఎంఎ) ఆరోపించింది. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ సీరియస్ అయ్యింది. ఈ మేరకు రాందేవ్ బాబాకు లీగల్ నోటీసులు పంపింది. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని లీగల్ నోటీసులో పేర్కొంది. దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ స్వ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఐఎంఏ తీవ్రంగా విమర్శించింది.

రాందేవ్ బాబాపై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకపోతే అల్లోపతి వైద్య విధానాన్నయినా రద్దు చేయాలని కేంద్రానికి స్పష్టంచేసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఇండియన్ మెడికల్ సోసియేషన్ హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాందేవ్ బాబా మాటలు ఉన్నాయని, ఆయనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది.

తాజాగా బాబా రామ్‌దేవ్ ఆధునిక వైద్య శాస్త్రాన్ని, వైద్య విధానాల‌ను అవ‌మానించే విధంగా మాట్లాడుతున్న వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఆయ‌న ఏం మాట్లాడారంటే.. 'అల్లోపతి ఒక కుంటి శాస్త్రం.. మొదట, హైడ్రాక్సీక్లోరోక్విన్ విఫలమైంది. ఇప్పుడు రెమ్‌డెసివిర్, ఐవర్‌మెక్టిన్, ప్లాస్మా థెరపీ విఫలమయ్యాయి. ఫాబిఫ్లు, స్టెరాయిడ్లతో సహా ఇతర యాంటీబయాటిక్స్ కూడా విఫలమయ్యాయి అని' బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. ఆక్సిజన్ కొరత కంటే అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది క‌రోనా రోగులు మరణించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story