మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో జరిగిన ఇఫ్తార్ విందు తీవ్ర వివాదానికి దారితీసింది. భోపాల్‌లోని ఆర్.డి. మెమోరియల్ కాలేజీలో మార్చి 11న నిర్వహించిన ఇఫ్తార్ విందు ఇప్పుడు రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. కళాశాల ప్రాంగణంలో ముస్లిం విద్యార్థులు, సిబ్బందితో కలిసి కొందరు హిందూ విద్యార్థినులు కూడా ఇఫ్తార్ (ఉపవాస విరమణ విందు)లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. విద్యాసంస్థల్లో ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
వీడియో బయటకు వచ్చిన వెంటనే విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ కార్యకర్తలు కళాశాల గేటు ముందు భారీ నిరసన చేపట్టారు. కళాశాలలో 'ఇస్లామీకరణ'ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ వారు నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు కళాశాల వెలుపల కూర్చుని హనుమాన్ చాలీసా పఠించారు. అంతటితో ఆగకుండా, క్యాంపస్ లోపల గంగాజలాన్ని చిలకరించి 'శుద్ధి' కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై విహెచ్‌పి కన్వీనర్ జితేంద్ర చౌహాన్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో మతపరమైన ఎజెండాను నడపడం సహించబోమని హెచ్చరించారు. అయితే, ఈ ఆరోపణలను కళాశాల యజమాన్యం తోసిపుచ్చింది. తమ కళాశాల అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తుందని, ఇటీవల క్యాంపస్‌లో హోలీ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించామని వారు వివరణ ఇచ్చారు. మత సామరస్యాన్ని చాటడానికే ఇఫ్తార్ నిర్వహించామని, ఎవరిపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.