గంట‌ల వ్య‌వ‌ధిలో కూలిన మూడు యుద్ధ విమానాలు.. వాయుసేన‌కు భారీ న‌ష్టం

IAF fighter jets crash in MP.గంట‌ల వ్య‌వ‌ధిలో వేరు వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2023 2:00 PM IST
గంట‌ల వ్య‌వ‌ధిలో కూలిన మూడు యుద్ధ విమానాలు.. వాయుసేన‌కు భారీ న‌ష్టం

గంట‌ల వ్య‌వ‌ధిలో వేరు వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్ప‌కూల‌డంతో భార‌త వాయుసేన‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లైంది. శిక్ష‌ణ‌లో ఉన్న రెండు ఫైట‌ర్ జెట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూలిపోగా రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్‌లో ఓ యుద్ధ విమానం ప్ర‌మాదానికి గురైంది.

రాజ‌స్థాన్ రాష్ట్రంలోని భ‌ర‌త్‌పూర్‌లో ఓ యుద్ధ విమానం కుప్ప‌కూలింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ మాట్లాడుతూ విమానం కూలిన ప్రాంతంలో స‌హ‌య‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. ఫైల‌ట్ కోసం గాలిస్తున్నామని భరత్‌పూర్‌ ఎస్పీ శ్యామ్‌ సింగ్‌ అన్నారు. సాంకేతిక లోపంతోనే ఈ విమానం కూలిపోయిన‌ట్లు అధికారులు బావిస్తున్నారు.

అటు మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో సుఖోయో-30, మిరాజ్ అనే రెండు యుద్ధ విమానాలు కుప్ప కూలాయి. రోజువారి శిక్ష‌ణ‌లో భాగంగా గ్వాలియ‌ర్ ఎయిర్ బేస్ నుంచి ఈ రోజు గాల్లోకి ఎగిరిన కాసేప‌టికే విమానాలు కూలిపోయాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ వ‌ర్గాలు తెలిపాయి. సుఖోయ్‌లో ఇద్ద‌రు, మిరాజ్లో ఒక ఫైల‌ట్ ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిలో ఇద్ద‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా, మ‌రో ఫైల‌ట్ కోసం గాలింపు చేప‌ట్టారు.

గాల్లో విమానాలు ఢీ కొన‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిందా అన్న దానిపైనా విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Next Story