భర్త తన భార్యకు తెలియకుండా నగలు, ఇతర వ్యక్తిగత వస్తువులను తనవే అనుకుని తీసుకోకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. పెళ్లి జరిగినంత మాత్రాన భార్యపై సర్వహక్కులు ఉన్నట్టు భర్త భావించకూడదని స్పష్టం చేసింది. భార్య నగలను దొంగతనం చేసిన కేసులో విచారణ సందర్భంగా కోర్టు ఈ వాఖ్యలు చేసింది. భార్య నగలు ఆమె పర్సనల్ ప్రాపర్టీ అని, భర్త వాటిపై నేరం కిందకు వస్తుందని జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది.
భార్య నగలను దోచుకెళ్లిన నిందితుడికి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. భార్యకు చెందిన నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అని, అలాంటి పరిస్థితిలో అది తీసుకున్నది భర్తే అయినా ఆమెకు తెలియకుండా తీసుకోవడం నేరమని పేర్కొంది. ఈ కేసులో దరఖాస్తుదారు ఫిర్యాదుదారు భర్త అయినప్పటికీ, భార్యకు తెలియజేయకుండా నగలు, గృహోపకరణాలను ఈ విధంగా తీసుకోవడానికి చట్టం అనుమతించదని జస్టిస్ అమిత్ మహాజన్ ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రోహిణిలోని కేఎన్ కట్జూ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై అతని భార్య దొంగతనం ఫిర్యాదు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన సమయంలో భర్త ఇంట్లోని నగలు, నగదు, ఇంటి సామాగ్రి దోచుకున్నట్లు సమాచారం. అదే సమయంలో, ఫిర్యాదుదారు తన ఇష్టానుసారం వెళ్లారని, అద్దె ఇంటిని విడిచిపెట్టడం వల్ల వస్తువులను తొలగించాల్సి వచ్చిందని నిందితుడైన భర్త చెప్పాడు.