దొంగలు సాధారణంగా రాత్రుళ్లు సమయంలో ఇళ్లలో పడి దోచుకుని అక్కడి నుండి పరారవుతారు. అయితే తాజాగా ఓ దొంగ దొంగతనం కోసం అని ఓ ఇంట్లోకి దూరి కిచిడీ వండుకుంటూ దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని విలువైన వస్తువులను దొంగిలించడానికి ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే అతడికి దొంగతనం చేసే ప్రయత్నంలో ఆకలి అయినట్లు ఉంది. వెంటనే ఇంట్లోని వంటగదిలోకి వెళ్లి కిచిడీ వండటం మొదలు పెట్టాడు. ఈ సంఘటన గౌహతి నగరంలోకి డిస్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో జరిగింది.
గౌహతి నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి హెంగేరాబరి ప్రాంతంలోని ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే తనకు బాగా ఆకలి కావడంతో ఇంటి వంటగదిలో కిచిడీని వండడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఇంట్లోని వ్యక్తులు వెంటనే అప్రమత్తమై దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. అస్సాం పోలీసులు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అరెస్టును ధృవీకరించారు. ఆ పోస్ట్‌కు కాస్తా హాస్యం జోడించారు. అస్సాం పోలీసులు ట్వీట్.. ''తృణధాన్యాల దొంగ యొక్క ఆసక్తికరమైన కేసు.! అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దొంగతనానికి ప్రయత్నించే సమయంలో కిచిడీని వండటం మీ శ్రేయస్సుకు హాని కలిగించవచ్చు. దొంగను అరెస్టు చేశారు. @GuwahatiPol అతనికి కొన్ని వేడి భోజనం అందిస్తున్నారు.'' ఈ విషయాన్ని గౌహతి నగర పోలీసు కమిషనర్ హర్మీత్ సింగ్ మీడియాకు తెలిపారు.